దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా ‘ఎవడు తక్కువ కాదు’ ట్రైలర్ విడుదల!

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’… ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి  శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. హరి గౌర సంగీత దర్శకుడు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ ట్రైలర్ విడుదల చేశాను. ట్రైలర్ చాలా చాలా బావుంది. ఇది తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్. ఆ సినిమా చాలా బావుంటుంది. ట్రైల‌ర్‌తో పాటు నేను కొన్ని విజువ‌ల్స్ చూశా. విక్రమ్ చాలా చాలా బాగా చేశాడు. ఆర్టిస్టుగా ‘రేసుగుర్రం’, ‘పటాస్’, ‘రుద్రమదేవి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ‘నా పేరు సూర్య…’ సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం, బాగా నటించడం గొప్ప విషయం. అప్పుడు విక్ర‌మ్‌కు 15 సంవత్సరాలు అంతే. ఇప్పుడు తనకు 17 ఏళ్ళు. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. ఆర్టిస్టుగా సినిమా నుంచి సినిమాకు ఎదుగుతున్నాడు. లగడపాటి శ్రీధర్ గారి ప్లాన్ కూడా బావుంది. కుమారుణ్ణి హీరోగా పెట్టి ఆయన ఒక పెద్ద సినిమా తీసేయొచ్చు. భారీ లాంఛింగ్ ప్లాన్ చేయవచ్చు. అలా కాకుండా కుమారుడు ఆర్టిస్టుగా ఎదగాలని, కళాకారుడిగా ఒక ప్రయాణం కొనసాగించాలని అనుకోవడం నాకు చాలా బాగా నచ్చింది.