ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!

కన్నడ సూపర్‌స్టార్స్‌లో ఒకరు, తెలుగు ప్రేక్షకుల్లోనూ సూపర్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రియల్‌ స్టార్‌ ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయమైన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాకు నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన
‘దిల్‌’ రాజు మాట్లాడుతూ ‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి’, పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అవుతున్న టైమ్‌. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్‌ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇదేంటి? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత తర్వాత నేను ‘ఆర్య’ స్ర్కిప్ట్‌ చూసినప్పుడు… ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేయాలి? అని ఆయన చూశా. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. ‘ఐ లవ్‌ యు’ సినిమా దర్శకుడు, నిర్మాత చంద్రు రెండు రోజులుగా నేను ఈ ఫంక్షన్‌కి రావాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఉపేంద్రగారితో పాటు ఆయన కోసం వచ్చాను. నా చేతుల మీదుగా మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసినందుకు ఐయామ్‌ హ్యాపీ. తెలుగులో, కన్నడలో సినిమా మంచి సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నా’’ అన్నారు.