Banner

కొన్ని పాటను చూసి ఇది ఫలానా వాళ్లు రాసారని ఇట్టే చెప్పేయచ్చు. అలా తాము రాసిన పాటపై ఓ ముద్ర వేసే వాళ్లు తక్కువ మందే ఉంటారు. అలా సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన తెలుగు తేజం…సుద్దాల అశోక్‌తేజ.ఆయన ప్రతీ పాటా ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. దాదాపు 29 సంవత్సరాల పాటల ప్రయాణం ఆయనది. అయినా ఇప్పటికీ ఆ పాటలో పరిమళం తొలి రోజు నాటి ఉత్సాహం, ఉత్తేజం ఆయన సొంతం.

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం సుద్దాల గ్రామంలో పుట్టారు. అమ్మా,నాన్నలు నిజాం నవాబులతో సాయుధ పోరాటం సలిపిన పోరాట యోధులు. చిన్నప్పటినుండి పాటలు రాయటం, కవితలు చెప్పటం అలవోకగా అబ్బేసింది. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్‌పల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమైన అశోక్ తేజ, సినీ నటుడు ఉత్తేజ్‌కు ఈయన మేనమామ. ఆ మామ పాటలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు ఉత్తేజ్. అదే అశోక్ తేజకు అవకాశాలు తెచ్చిపెట్టింది. తండ్రి లా గొల్లవాళ్ళు చెప్పే ఒగ్గు కథల నుంచి, బుర్ర కథల మూల రూపమైన శారదాకారుల భాష నుంచి ప్రజల భాషని గ్రహించి ప్రజల భాషలో చెప్పటం అలవాటు చేసుకున్నారు. అదే ఆయన్ని అందరిలో ఒకరిలా విభిన్నంగా సిని పరిశ్రమలో నిలబెట్టింది.

అందకు ముందు ఎన్ని పాటలు రాసినా బ్రేక్ వచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలిసిన తర్వాతే. ఒసేయ్ రాములమ్మా పాటలు ఓ సెన్సేషన్. ఆ తర్వాత కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో ఇండస్ట్రీ హాట్ ప్రాపర్టీగా మారారు అశోక్ తేజ. ‘ఠాగూర్’లో ఆయన రాసిన “నేను సైతం…” పాట ఆయనను జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలిపింది.

సుద్దాల అశోక్ తేజ పాటలు ఓ కొత్త ప్రమాణాలు నెలకొల్పాయి. సహజత్వం కు ఆయన పాటల్లో ప్రయారిటీ ఇస్తారు. అక్కడక్కడా కవిత్వం..చిన్న చిన్న పదాలతో పాటలు సుద్దాల అశోక్ తేజ బాణీ . అందుకు చిన్న ఉదాహరణ శేఖర్ కమ్ముల‘ఫిదా’లో రాసిన “వచ్చిండే… పిల్లా మెల్లగా వచ్చిండే…” పాట. రీసెంట్ గా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’లోనూ సుద్దాల అశోక్ తేజ రాసిన “కొమ్మా ఉయ్యాల…”, “కొమురం భీముడో…” ఆల్ టైమ్ హిట్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆ పాటలే. ఇలా ఈ పాటతో మరోమారు సుద్దాల అందరి మన్ననలూ అందుకుంటున్నారు. భవిష్యత్ లోనూ తన పాటలతో సుద్దాల మరింతగా అలరిస్తారని ఆశిద్దాం.

ఈ సినీ ప్రయాణంలో ఎన్ని ఎత్తులు చూశాడో, ఎన్ని లోతులు చూశాడో, ఎన్నెన్ని మలుపులు తిరిగాడో ప్రక్కన పెడితే ఎంత మంది హృదయాలను కదిలించాడో అనేదే ఆయన స్దాయిని ఏంటో చూపిస్తుంది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. సాహిత్యానికి,సందేశం కలిపి సరిగమలు పలికించే అశోక్ తేజ గారికి మరొక్కసారి . telugu100.com జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

Banner
, , , , , ,
Similar Posts
Latest Posts from VendiTera.com