సినీ సాహిత్య దిగ్గజం సి.ఎస్.రావు మృతి

కొందరికి బహుముఖ ప్రజ్ఞ  ఉంటుంది. అప్పట్లో భానుమతికి, నందమూరి తారకరామారావు కు ఇలా కొందరికే ఈ ప్రతిభ సొంతం. ఓ ప్రక్కన రచన చేయగలరు..మరో ప్రక్క నటించగలరు. ఆ రచనలోను రకరకాల విన్యాసాలు చేయగలరు.హృదయాలను స్పృశించగలరు. సామాజిక అంశాలను ఎక్కువమందికి రీచ్ అయ్యే కమర్షియల్ భాషలో చెప్పటంలో దాదాపు పిహెడ్ డీ వంటిది చేసినట్లుగా తన రచనలు చేయటం ఆయన స్పెషాలిటీ. ఆ రచనా దిగ్గజం ఈ రోజు హైదరాబాద్ లో కన్ను మూసారు.

వివరాల్లోకి వెళితే… సుప్రసిద్ధ సినీ, నవలా, నాటక రచయిత శ్రీ సి.ఎస్.రావు (85) నేడు హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు కథలు అందించారు. అలాగే ఎన్టీఆర్  సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఇక నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు.

 ప్రస్తుతం సి.ఎస్.రావు చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు.శ్రీ సి.ఎస్.రావుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాకౌడౌన్ నియమాలను గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే అంత్యక్రియలు జరగనున్నాయి.