దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు! – ‘నిను వీడని నీడను నేనే’ థాంక్యూ మీట్‌లో ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే, స‌క్సెస్‌టూర్‌కు వెళిన సందీప్ కిష‌న్‌, హీరోయిన్ అన్యా సింగ్‌, ఇత‌ర టీమ్ స‌భ్యుల‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. శనివారం సాయంత్రం ఈ సినిమా థాంక్యూ మీట్ నిర్వహించారు.   సందీప్ కిషన్ మాట్లాడుతూ “వెంకటాద్రి టాకీస్‌లో ఈ విజ‌యానికి నేను ముఖ్యంగా వేంకటేశ్వర స్వామికి థాంక్స్ చెప్పుకోవాలి. విడుదలకు ముందు రోజు గురువారం రాత్రి తిరుమల వెళ్లాను. శుక్రవారం ఉదయం నా దర్శనం. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఒంటిగంటన్నరకు ఫోన్ ఆన్ చేస్తే రిజల్ట్ తెలుస్తుందని అనుకున్నాను. సాధారణంగా మూడు, నాలుగు గంటలకు నా సినిమా రిజల్ట్ నాకు తెలుస్తుంది. అంటే… ఆడుతుందా? లేదా? అని. ఇప్పటివరకూ చూస్తే… నిజాయతీగా నేను ఫలితం గురించి చెప్పేశా. ఆడకపోతే ఆడలేదని, ఆడితే ఆడిందని. ‘నిను వీడని నీడను నేనే’ విషయానికి వస్తే… మూడు గంటలకు నాకు అర్థం కాలేదు. పరిస్థితి ఏంటని. అందరూ బావుందంటున్నారు. రివ్యూలు బావున్నాయి. కానీ, నేను కన్వీన్స్ కాలేదు. ఊరికే నెత్తికి ఎక్కించుకోకూడదు. హిట్టా? కాదా? అని కరెక్టుగా అర్థం చేసుకోవాలని అనుకున్నా. ఆరు గంటలకు ఫోనులు రావడం స్టార్ట్ అయింది. నిజంగానే సందీప్‌కి హిట్ ప‌డిందా? అని ఆలోచించి, టైమ్ తీసుకుని, అర్థం చేసుకుని  అందరూ ఫోనులు చేశారు. సోమవారం నుంచి ఇండస్ట్రీలో అందరూ ఫోనులు చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద వాళ్లు క్యూబ్‌లో షో వేయించుకోవాలని ఫోన్లు చేయడం, చూశాక చాలా బావుందని ఫోనులు చేయడం మొదలయ్యాయి. ఈ సినిమాకు జరిగిన ఒక అద్భుతం ఏంటంటే… చాలా రోజుల తరవాత రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి ‘సినిమా చూశాం. చాలా చాలా బావుంది. ఫలానా సీన్ బావుంది. లాస్ట్ లో మదర్ సెంటిమెంట్ బావుంది’ అని చెప్పారు. అది నిజమైన విజయమని నేను భావిస్తా. ఇంచుమించు రెండేళ్ల తరవాత విజయం వచ్చింది. హిట్, మంచి హిట్ వచ్చింది. బ్లాక్‌బ‌స్ట‌ర్‌, సూప‌ర్ హిట్ అన‌ను. ఆ విష‌యంలో నేను నిజాయ‌తీగా ఉంటాను. ఈ సినిమా విడుదలకు ముందు కథ తెలిసిన వాళ్లు, సినిమా చూసినవాళ్లు… ‘సెకండాఫ్‌లో ఎందుకు ఎమోష‌న్‌ మీద వెళుతున్నారు. తనను ఎవరో చంపేసి ఉండొచ్చు కదా. సక్సెస్ ఫార్ములా. కమర్షియల్ ఫార్ములా. గతంలో సక్సెస్ అయిన సినిమాల్లా ఇదీ సక్సెస్ అవుతుంది’ అన్నారు. అలా చేస్తే ఆ సినిమాలకు ఈ సినిమాకు తేడా ఉండదు. ఇది అటువంటి సినిమా ఇంకొకటి అవుతుంది. నేను వాళ్లకు అదే చెప్పాను. అమ్మానాన్న ప్రేమను, ఎమోషన్ ను మేం బలంగా విశ్వసించాము. ఆ నమ్మకంతో ముందుకు వెళ్లాం. మా నమ్మకం ఈ విజయాన్ని ఇచ్చిందని నమ్ముతున్నా. విశాఖ నుంచి ఒక పెద్దావిడ ఫోన్ చేశారు. సినిమా చూశాక కళ్లవెంట నీళ్లు వచ్చాయని చెప్పారు. ‘మా అబ్బాయి మూడు నెలల కిందట లవ్ ఫెయిల్యూర్ అని సూసైడ్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా మూడు నెలల కిందట వచ్చి ఉంటే, మా అబ్బాయి సినిమా చూసి ఉంటే.. ప్రాణాలు తీసుకునే ముందు మా గురించి ఆలోచించే ఉండేవాడేమో’ అన్నారు. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అదే ‘నిను వీడని నీడను నేనే’ సినిమా విజయం. ఈ సినిమాకు భారీ లాభాలు రావాలని మేం పని చేయలేదు. మంచి సినిమా, నిజాయతీతో కూడిన సినిమా తీయాలనుకున్నాం. ఎవరికీ నష్టం రాకూడదని తీశాం. ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా…  మమ్మల్ని నమ్మి సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూట‌ర్ సేఫ్ అయ్యాడు. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకర గారు ఇవాళ సంతోషంగా. హ్యాపీగా ఉన్నారు. థియేటర్లలో చూడని వాళ్లు త్వరగా థియేటర్లకు వెళ్లండి. నెక్స్ట్ సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తాం. చాలా గర్వంగా చూపించుకోదగ్గ మంచి ప్రాజెక్ట్ అది. సోమవారం నుండి నెల రోజుల పాటు వివాహ భోజ‌నంబు నుండి వంద‌మందికి ఫ్రీ ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నాం. ఈ సినిమాకు ద‌యా, అనిల్‌గారితో పాటు నెల్లూరు డాక్ట‌ర్‌గారు, మా డిస్ట్రిబ్యూట‌ర్‌ ఎంతో హెల్ప్ చేశారు. నాలుగు ఏరియాలు ఆయనే కొన్నారు” అని అన్నారు.