Banner

చూడచక్కని రూపంతో చక్కని అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అలనాటి మేటి నటి సావిత్రి జీవిత విశేషాలతో వచ్చిన సినిమా ‘మహానటి’. గత పది రోజులుగా ఫేస్ బుక్, ట్విట్టర్,కాఫీ షాప్, ఫంక్షన్స్ ,ఇలా ఎక్కడ నలుగురు తెలుగువారు చేరినా మాట్లాడుకుంటున్న ఏకైక విశేషం ‘మహానటి’. మొన్న శుక్రవారం నుంచి తమిళనాట కూడా ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం తర్వాత ఓ తెలుగు చిత్రం ఈ స్దాయిలో చర్చించబడటం గొప్ప విశేషం. ఈ సినిమాకు కీర్తి మాత్రమే కాదు కనకం కూడా భారీగా కురుస్తోంది. . శాటిలైట్ రైట్స్ సైతం ఇరవై కోట్లు వరకూ పలుకుతున్నాయని తెలుస్తోంది. కీర్తి సురేష్‌ ముఖ్యపాత్రలో కనిపించిన ఈ సినిమాకు నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా అతడికిది రెండో సినిమానే. అంతలా రెండో సినిమాకే అందరి మనుస్సులు గెలుచుకున్న అతను అసలు ఎవరు, అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే ఆసక్తి కలగటం సహజం.

నాగ్ అశ్విన్..బేసిగ్గా కుటుంబ నేపధ్య రీత్యా సినిమా పరిశ్రమకు అసలు సంభందం లేనివాడు. అమ్మానాన్నా ఇద్దరూ డాక్టర్లే. అమ్మ జయంతీ రెడ్డి… గైనకాలజిస్టు. నాన్న జయరాంరెడ్డి యూరాలజిస్టు. హైదరాబాద్ లో జె.జె హాస్పటిల్స్ వారిదే. అయితే ఈ కుర్రాడు డాక్టర్ అవ్వలేదు.యాక్టర్ అవ్వాలనుకోలేదు దర్శకుడు అవ్వాలనుకున్నాడు. అమ్మా,నాన్నా ఓకే అన్నా… సినిమాల్లోకి వెళ్లేముందు ఫిల్మ్‌ కోర్స్‌ చేస్తే బావుంటుందని అన్నారు. అయితే సినిమా తీసే కళ ఒకరు నేర్పితే వచ్చేది కాదనేది ఈ కుర్రాడు ఉద్దేశం. అయినా అమ్మా,నాన్నా చెప్పారు.. ఎంతో కొంత అవగాహన వస్తుందిలే అని న్యూయార్క్‌ వెళ్లి సినిమాటోగ్రఫీలో ఆర్నెల్ల కోర్సు చేశాడు. థీరి పూర్తైంది…ఇక ప్రాక్టికల్స్ చేయాలి.

న్యూయార్క్‌ నుంచి తిరిగి వచ్చాక మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘నేను మీకు తెలుసా?’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసారు. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల గారి దగ్గర ‘లీడర్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాలకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత చిన్న ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టి యాడ్స్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలూ చేయటం మెదలెట్టారు. అప్పుడే ప్రియాంకాదత్‌, స్వప్నాదత్‌ల లు చేసిన ఓ ప్రకటన చేసి వాళ్లతో కలిసి ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేశారు.షార్ట్ ఫిలిం పూర్తయ్యేసరికి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఆ జర్నీలో నాగ్ అశ్విన్ సినిమా కథల్ని వినిపించటం చేసేవారు.అలా బయిటకు వచ్చిందే ‘ఎవడే సుబ్రమణ్యం’. నానీ, విజయ్‌ దేవరకొండ నటించిన ఆ సినిమా సక్సెస్ అయ్యింది.. మంచి గుర్తింపు తెచ్చింది.. ఆ సినిమా జర్నీలో ప్రేమలో పడ్డ అశ్వినీదత్ పెద్ద కూతురు ప్రియాంక దత్ ను పెళ్లి చేసుకున్నారు.

లక్ష్య్యమే సక్సెస్ కు కారణం

ఆ తర్వాత ఏం చెయ్యాలి అనే ఆలోచనల్లోంచి పుట్టిందే సావిత్రి బయోపిక్. సావిత్రిగారు ఉండి ఈ సినిమా చూసుంటే ఆమె కూడా ‘బాగా తీశారు’ అని సంతృప్తి చెందేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. ప్రాజెక్టు ఓకే అనుకున్నాక నటీనటుల ఎంపిక, కథ, సెట్‌లూ… అన్నింటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. ఆవిడ గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఒక ప్రామాణికమైన సినిమా తీయాలనుకున్నారు. కల్పితాలు జోడించకుండా, వాస్తవాలని చెబితేనే ఆ విలువ ఉంటుందనిపించి… వ్యక్తులూ, సందర్భాలూ, భావోద్వేగాలూ అన్నీ వాస్తవమైనవే తీసుకున్నారు.

అంతేకాదు.. ఇప్పుడంతా డిజిటల్‌లో సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చరిత్రలోకి వెళ్తున్నాం కాబట్టి కొన్ని సీన్లవరకూ ఫిల్మ్‌లోనే చిత్రీకరించారు. ఫిల్మ్‌లో తీస్తే అప్పటి లుక్‌ వస్తుందని అలా ప్రయత్నించారు. అందుకే ఈ స్దాయి విజయం ఈ సినిమా సొంతం చేసుకుంది.

Banner
Similar Posts
Latest Posts from VendiTera.com