Banner

కొందరు ఎల్లకాలం సజీవులే. కొన్ని సినిమాలు నిత్యం నిత్య నూతనాలే. అలా స్వర్గానికి ఎగిసినా తమ పేరుని తెలుగువారు తలుచుకోకుండా ఉండలేని పరిస్దితి కలిపించిన జంట బాపు-రమణలు అయితే వారి నిత్య నూతన చిత్రం బంగారు పిచుక. సూపర్ హిట్ అయిన సినిమా కూడా మరుసటి నెలకు గుర్తు ఉండవు. కానీ ఓ ఫ్లాఫ్ సినిమా ఇన్నేళ్లుగా జనాల నోట్లో నానటం అంటే మాటలు కాదు.  బంగారు పిచక చేస్తున్నప్పుడు బాపు-రమణలు కూడా హిట్ అవుతుందేమో అనుకుని ఉంటారు కానీ ఇలా ఇన్నేళ్లుగా జనం సంస్మరణ సభలు సైతం చేస్తారని ఊహించి ఉండరు.
ఇంతకీ బంగారు పిచుకలో ఏముంది..
ఓ కొత్తదనం ఉంది. ముఖ్యంగా ఆ కాలంలో అసలు రోడ్ జర్నీ మూవి అనేది భారతీయ సినిమా పరిశ్రమ ఊహించని రోజుల్లో వచ్చిన ఓ చక్కటి ప్రయత్నం. అప్పటికాలానికి కాస్త కొత్తచేసిందేమో కానీ కంటెంట్ ఇన్నాళ్లూ ఆ సినిమాని సజీవంగా మన మనస్సులో ఉండేలా చేసింది. 
బాపు దర్శకత్వంలో చంద్రమోహన్, విజయనిర్మల, శాంతకుమారి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ సినిమా.. 1968 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా …ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పటిల్ లో ని ఆడిటోరియంలో ఓ సంస్మరణ సభ జరిగింది. ఆ విశేషాలు,ఫొటోలతో చూద్దాం..
ఈ సంస్మరణ సభకు ఆశించినంత మంది రాకపోయినా,  వచ్చిన ప్రముఖులు శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి, గురవారెడ్డి, జంపాల చౌదరి గార్లు ఈ కార్యక్రమాన్ని ఓ అద్బుతంలా మార్చేసారు. ముఖ్యంగా జంపాల చౌదరి గారు పుస్తక పఠనం అనే అంశంలో తనకి అత్యంత ఇష్టమైన ‘కానుక’ కథని చదివారు. ఇక గురువారెడ్డిగారు తన పుస్తకానికి రమణగారు రాసిన ముందు మాట ను చదివి ఆయన హాస్య చతురతను మెచ్చుకుంటూ బాపు రమణల పరిచయం వరప్రసాద్ రెడ్డి వల్ల జరిగిందని , వాళ్లతో తన అనుబంధాన్ని పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. 
ప్రముఖ టీవి యాంకర్, నటి ఝాన్సి, ప్రముఖ రచయిత ,కార్టూనిస్ట్ బ్నిం, నటుడు గుండు సుదర్శనం, నటి గాయిత్రి భార్గవి, రచయిత, దర్శకుడు, కార్టూనిస్ట్ మనోహర్ గాంధీ తదితరులు వచ్చి తమ అభిప్రాయాలన్ని , బాపు రమణలపై తమకున్న అభిమానాన్ని వెల్లడించారు. 
ఈ వేడుక చూస్తూంటే..ఓ సినిమా లో విషయముంటే..ఎన్ని వందల ఏళ్లు అయినా నిర్విరామంగా సంస్మరణ సభలు జరుపుకుంటుందని అర్దమైంది. 
జై బాపు..జై రమణ..జై జై బంగారు పిచుక. 

Banner
Similar Posts
Latest Posts from VendiTera.com