ఫీమేల్‌ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’ లోగో విడుదల!

ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్‌ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్‌ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్‌ దీప్తీ భట్నాగర్‌, సదా, సుమన్‌ రంగనాథ్‌, హరితేజ, హర్షవర్ధన్‌ రాణే, పూజా జవేరి ప్రధాన పాత్రధారులు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు సుందర్‌ పవన్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక ఫీమేల్‌ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్‌ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్‌, సుమన్‌ రంగనాథ్‌, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నారు. వారి తర్వాత మరికొందరు యాక్టింగ్‌ ప్రారంభించినవారు కొందరున్నారు. వీరందరినీ ఒప్పించడం కొంచెం కష్టమైంది. అందరినీ ఒక చోటుకు చేర్చి ఈ ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయడం మా నిర్మాత భోగేంద్ర గుప్తాగారు లేకపోతే సాధ్యం అయ్యేది కాదు. అతి త్వరలో సినిమా షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తాం. సాయిశ్రీరామ్‌ వంటి బ్రిలియెంట్‌ సినిమాటోగ్రాఫర్‌, యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ సదాశివుని సినిమాకు పని చేస్తున్నారు’’ అన్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన ప్రతి ఆర్టిస్ట్‌కి పేరు పేరునా కృతజ్ఞతలు. పవన్‌ చాలా కోపరేటివ్‌ డైరెక్టర్‌. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.