తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్ది నెక్ట్ లెలివ్ కు తీసుకెళ్లిన వేటగాడు…ఆటగాడు రాఘవేంద్రరావు. పండ్లు, పూలతో వెండితెరను వేడిక్కించవచ్చు అని నిరూపించిన సినీ శాస్త్రజ్ఞుడు ఆయన. తెరపై శృంగార సామ్రాజ్యాన్ని అలవోకగా ఆవిష్కరించగల వెండితెర శ్రీనాధుడి పుట్టిన రోజు ఈ రోజు. సామాన్యుడులోని కళా పోషణ ని తట్టి లేపుతూ, ఆకు చాటు పిందె అంటూ థియోటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టిన సినీ మేధావి ఆయన . ఈ రోజు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి..తెలుసుకోవాల్సినవి లేవు. కానీ ఆయన ఘనమైన కీర్తి మాత్రం తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉంటుంది. తెరపై ఇది రాఘవేంద్రుడు ముద్ర అని గుర్తు చేస్తుంది. మన దర్శకేంద్రుడి పూర్తి పేరు….కోవెలమూడి రాఘవేంద్రరావు. మన అందరికి పరిచయమున్న పేరు కె. రాఘవేంద్ర రావు బిఏ. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం అంటే ఏంటో ఘరానాగా చెప్పిన అల్లరి బుల్లోడు ఈయన.
అందాల విరులు తెరపై పరిచి …తెలుగు చిత్ర సీమలో “సిరులు” పండిచడం ఎలాగో నేర్పిన ఘనుడు ఈయన. ఎంతో మంది హీరోలకు స్టార్‌డమ్‌ను అందిచిన దర్శకుడు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, శోభన్‌బాబు లాంటి హీరోలకు ఆయన దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్స్ లభించాయి.. ప్రపంచంలో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల్లో దర్శకేంద్రుడు ఒకరు.. తెలుగు తెరకి గ్లామర్‌ని తీసుకొచ్చిన దర్శకుడు కూడా ఆయనే, హీరోయిన్లను అందంగా చూపించడంలోను, స్క్రీన్‌ను అందమైన కాన్వాస్‌లా మలచడంలోనూ, కే. రాఘవేంద్రరావు ని మించిన దర్శకులు తెలుగు లో లేరంటే అతి శయోక్తి కాదు. అందుకే అప్పుడు ఇప్పుడు హీరోయిన్లు రాఘవేంద్రారవుగారి దర్శకత్వంలో ఒక్కసినిమా అయినా చేస్తే చాలు అనుకుంటారు..
ప్రేమ్ నగర్ వంటి అద్భుతమైన ప్రేమకథలను అందించిన ప్రకాశ్ రావు కుమారుడే మన కోవెలముడి రాఘవేంద్రరావు, ఈయన 1942 మే 23 న జన్మించారు. తండ్రితో పాటు విక్టరి మదుసూదన్గారి దగ్గర శిష్యరికం చేసిన రాఘవేంద్రరావు.. 1975 లో వచ్చిన బాబు సినిమాతో డైరెక్టర్‌గా మారారు..
కెరీర్ ప్రారంభంలో ఆఫ్ బీట్ సినిమాలు మాత్రమే తీసిన రాఘవేంద్రడు తరువాత తరువాత కమర్షియల్ పంథాకు మారాడు.. ముఖ్యంగా 1977లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన అడవిరాముడు సినిమాతో పూర్తి స్థాయి కమర్షియల్ డైరెక్టర్‌గా టాలీవుడ్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు.. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన వేటగాడు, డ్రైవర్‌రాముడు, గజదొంగ, కొంటవీటి సింహం లాంటి సినిమాలు వరుస హిట్స్‌గా నిలిచాయి. సూపర్ స్టార్ కృష్ణ ని సరికొత్త కోణంలో చూపించిన దర్శకుడు కూడా రాఘవేంద్ర రావే. వీరి కాంబినేషన్లో వచ్చిన అగ్ని పర్వతం సూపర్ స్టార్ పాపులారిటీని రెట్టింపు చేసింది. యన్.టి.ఆర్ తర్వత ఎక్కువగా కృష్ణ తోనే సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసారు రాఘవేంద్రరావు.
మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావుల కాంభినేషన్లో భారీ హిట్స్ వచ్చాయి..అడవిదొంగ, ఘరానమొగుడు, రౌడి అల్లుడు, ఇద్దరు మిత్రులు లాంటి హిట్ చిత్రాలతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి మాస్టార్ పీస్ కూడీ వీరి కాంభినేషన్లో రూపొందిందే. అంతేకాదు అతి ఎక్కువ మంది వారసులను టాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా రాఘవేంద్రరావే.. విక్టరీ వెంకటేష్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లను వెండితెరకు అందిచిన ఘనత కూడా రాఘవేంద్రునిదే..
కమర్షియల్ సినిమాలతో తనకంటూ అరుదైన ఫాలోయింగ్ సంపాదించుకున్నా ఆయన ఆ సినిమాలతోనే ఆగిపోవాలనుకోలేదు.. అందుకే భక్తి రసాన్ని కూడా వెండితెర మీద పారించాడు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలో రాఘవేంద్రరావు, నాగార్జునల కెరీర్లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి.. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి గొప్ప చిత్రాలు తీశాడు. ఎప్పుడూ ఆయనది ఒకటే ఆలోచన…సినిమా టికెట్ కోసం సగటు మనిషి పెట్టిన డబ్బులకి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పంచాలి అని. అలాంటి , మన దర్శకేంద్రుడు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి ఆశిస్తూ. పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ గురు దక్షిణగా ప్రముఖ టీవి దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, మీర్ గారు అందించిన వీడియో చూడండి.