ఏవండీ ప్లాఫ్ సినిమాని సారీ..సారీ..ఓ డిజాస్టర్ సినిమాని ఎవరైనా గుర్తు పెట్టుకుంటారా…ఆ దర్శక,నిర్మాతలు కూడా ఓ పీడ కలలా మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో తెలియక అప్పుడు ప్లాఫ్ చేసారు కానీ నిజంగా ఆ సినిమా అద్బుతం అని ఎన్నేళ్లు అయినా మన మనస్సు లో రొద పెట్టి, మనని ఒప్పించి,యూట్యూబ్ లో ఓ సారి చూసేద్దాం అనిపించే సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాల లిస్ట్ తెలుగులో చెప్పమంటే మొదటగా గుర్తుచ్చే సినిమా బంగారు పిచ్చుక.
1967లో “సాక్షి” చిత్రం విడుదలై ఆశించినంతగా ఆర్థిక విజయం సాధించకపోయినా బాపు-రమణలకు బోల్డంత పేరు తెచ్చిపెట్టింది.తర్వాత రోడ్ మూవీగా “బంగారు పిచ్చుక” తీశారు. పేరుకి కామెడీనే కానీ ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్. హీరోయిన్ కు కట్టూబొట్టూ మాత్రమే కాదు, కనుబొమలు అల్లార్చడాన్ని కూడా నేర్పిన అద్భుత దర్శకత్వం. ఎవ్వరి దగ్గరా శిష్యరికం చేయకుండా బొమ్మలు వేసినట్టే, దర్శకత్వంలోకి కూడా నేరుగా దిగి చేసిన ప్రయోగం.
ఈ సినిమా గొప్పతనం ఏమిటీ అంటే..బంగారు పిచ్చుక … తెలుగు లో వచ్చిన మొట్టమొదటి రోడ్డు సినిమా. హీరో హీరోయిన్లు ఇద్దరినీ ఒకే డ్రెస్ లో ఒకే కారులో లాగిస్తూ మన మనస్సుని ఊహల్లో ఊరేగిస్తూ తీసిన సినిమా ఇది. పదహారణాల అచ్చ తెలుగు ప్రేమకథకి పంజరంలోని బంగారు పిచ్చుకకి తోడిచ్చి గాలిలోకి వదిలిన ఘనలు బాపు-రమణలు.
ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో చంద్రమోహన్, విజయనిర్మల, శాంతకుమారి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ సినిమా.. 1968 లో రిలీజ్ అయ్యినప్పుడు మరీ కొత్తగా అనిపించిందో ఏమో కానీ ..ఇదేం సినిమా అని అంతా పెదివి విరిచేసి, ఫిల్మ్ డబ్బాలు వెనక్కి పంపేసారు. కానీ అందులో కంటెంట్ మాత్రం ఎప్పటికీ పాతబడక ఇప్పటికి ముచ్చటగా మనలని అలా కట్టిపారేస్తుంది. బాపు-రమణలకు కూడా అదే అనిపించి మళ్ళీ అదే సినిమాని ..పెళ్లి కొడుకు అని మళ్లీ రీమేక్ చేసారు. అయితే తొలిసారి ప్లాఫ్ అన్నారు. ఈ సారి హిట్ అంటే ఏమన్నా అనుకుంటారనుకున్నారో ఏమో జనం..మళ్ళీ ఫ్లాఫ్ అనేసారు. కానీ ఇప్పుడు ఆ సినిమా చూస్తే..మళ్లీ ఇప్పటి స్టార్స్ తో ఎందుకు రీమేక్ చేయకూడదు అనే టెమ్టేషన్ కలుగుతుంది. కాబట్టి దర్శక,నిర్మాతలు కాస్తంత ఈ సినిమాకు దూరంగా ఉండటమే మేలు.
ఇక బాపుగారిలో ఉన్న గొప్పతనం ఏమిటీ అంటే… ఆయన సినిమాలు విజయం సాధించినా, పరాజయం పాలైనా పొంగిపోయిందీ లేదు, కుంగిపోయిందీ లేదు. సినిమాలు హిట్ అయ్యి నప్పుడు ఎంత వినూత్నంగా ప్రకటనలు రూపొందించారో, సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు అంచనాలు తారుమారు చేసిన చిత్రం’ అని సృజనాత్మకంగా ప్రకటనలు ఇవ్వగలిగారు.
‘బంగారు పిచ్చుక’ సినిమా ఘోరపరాజయం పాలైనప్పుడు ఓ పిచ్చుక తలకిందులుగా నేలను తాకి కళ్ళు తేలవేసినట్టుగా కార్టూన్ వేయగలిగే ధైర్యం, హాస్యప్రియత్వం బాపు,రమణలసొంతం.
ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా …ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిన్న కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.