‘చెలియా ఉంటానే’ పాట అనుపమా పరమేశ్వరన్ వల్లే సాధ్యమైంది: గాయకుడు యాజిన్ నిజార్

గాయకుడు యాజిన్ నిజార్ పేరు, అతను పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘శీతాకాలం సూర్యుడిలా…’, ‘లోఫర్’లో ‘జియా జలే జలే’, ‘కుమారి 21ఎఫ్’లో ‘మేఘాలు లేకున్నా…’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో ‘చిరునామా తన చిరునామా’, ‘వున్నది ఒకటే జిందగీ’లో ‘లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో’, ‘భరత్ అనే నేను’లో ‘ఓ వసుమతి ఓ వసుమతి’, ‘118’లో ‘చందమామే’, ‘బాహుబలి’లో ‘బలి బలి రా బలి’ వంటి హిట్ పాటలను పాడినది ఇతనే. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్,రవితేజ, నందమూరి కల్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలకు, రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, రాజ్ తరుణ్ వంటి యువ హీరోలకు పాటలు పాడారు. మలయాళ, తమిళ సినిమాల్లో పలు పాటలు పాడిన యాజిన్ నిజార్ తాజాగా ‘చెలియా ఉంటానే’ అని ఓ మ్యూజిక్ సింగిల్ చేశారు. యాజిన్ నిజార్ పాడిన, నటించిన మ్యూజిక్ వీడియో ‘చెలియా ఉంటానే’. నీరో సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ తొలిసారి నటించిన మ్యూజిక్ వీడియో ఇదే. ఆదిత్య మ్యూజిక్ ఒరిజినల్స్  ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ పాట విడుదలైంది. తెలుగు వెర్షన్ ‘చెలియా ఉంటానే’కి మౌనిక సాహిత్యం అందించగా… తమిళ్ వెర్షన్ ‘ఉయిరే ఉన్నోడు’కు నీరో సాహిత్యం అందించారు. ఇంగ్లీష్ లిరిక్స్ రాసినది, పాడినది అలెన్ బాబు డేనియల్.